4, అక్టోబర్ 2012, గురువారం

తాజమహల్ షాజహాన్ కట్టించిందేనా? చారిత్రాత్మక ఆధారాలు - 1వ భాగం

రచన :- రావు తల్లాప్రగడ





అంతులేనివాడిని అక్ష్యమగువాడిని, అన్నీ తెలిసినవాడిని, అందరికీ మంచి చేసేవాడిని, బోర్లించిన పద్మాకారమున వుండే హృదయసముద్రంలో నిలిపి పూజిస్తాను.

నారాయణ సూక్తంలోని ఇలా తలక్రిందులుగా ఉన్న పద్మం గురించి, దాని ప్రాశస్త్యం తెలుపుతుంది. మరి మహమ్మదీయులు కట్టించిన ఆ తాజమహల్ పైన ఆ పద్మం ఎందుకుంది?

అంతే కాదు కాక మహమ్మదీయుల గోపురాల పైన పద్మాలే కాదు, కలశం వుంచే సాంప్రదాయం కూడా వుండదు. వారి గోపురాలు సాధారణంగా నున్నగా బోడిగుండ్లవలే వుంటాయి. కానీ తాజమహల్ గోపురం పైన ఒక (తలక్రిందులుగా ఉన్న) పద్మం; దాని పైన ఒక త్రిశూలం; ఆ త్రిశూలం లోని మద్య శూలంగా ఒక కలశం; ఆ కలశంపై కొబ్బరికాయ, మామిడాకులు వుండడం; ఆ (శివుని) త్రిశూలమే అర్థచంద్రాకారంలో ఉండటం.... ఇందులో ఏదైనా ... ఏ ఒక్కటైనా... ... ఏ రకంగా ఆలోచించినా .... ... మహమ్మదీయ సాంప్రదాయానికి సంబంధించినవా? మరి ఐతే, ఇవన్నీ ఆ తాజమహల్ నెత్తిన ఎందుకున్నట్లు.. ? ఇంకా ఈ విషయం ఆలోచనను రేకెత్తించకుంటే ... మనం అసలు ఆలోచించడం లేదన్న మాట!

సరే ఇక అనుమానం మొదలయ్యింది కనుక, అధ్యయనం మొదలు పెడదాం. సాక్షాధారాలను పరిశీలించి నిర్ణయిద్దాం! ఇది హైందవభవనమో లేక ఆలయమో అనిపిస్తే సగర్వంగా చెప్పుకుందాము. మనకు కావలసిన్నని కలహాలు ఇప్పటికే వున్నాయి కనుక; ఇంకో కొత్తది సృష్ఠిద్దామని కాదు; ఇకపైన తాజమహల్ని ఒక హిందూ మందిరంగా మార్చేసుకుందామనీ కాదు; మన సంస్కృతిని సరిగ్గా గుర్తించి అందరికీ చాటి చెప్పుకోవడమే ఇందులోని పరమార్థం. నిజానిజాలను గుర్తించి చరిత్రను సరిగ్గా వ్రాసుకోవాలన్న ఆలోచనే, ఈ అన్వేషణలోని స్ఫూర్తి. కేవలం వక్రదృష్టి తోనో లేక విరోధభావంతోనో చూసే వారి కి ఈ వ్యాసాన్ని ఇక పై చదవద్దని విజ్ఞప్తి. 

తాజమహల్ అన్న మాట వింటేనే చాలు, మన మనస్సులలో ఏదో తెలియని ఆనందము, ఒక ప్రేమ కథ, ఒక మధురచిహ్నము అనేటువంటి స్పందనలు కలుగుతాయి. ఎన్నో శతాబ్దాలుగా ఇది మన మస్సులో నాటుకు పోయిన తీపి భావన ఇది. ఈ భావన చాలు, దాని వెనుక వున్న నిజాలన్నీ మర్చిపోవడానికి! అందుకే ఎందరో ఎన్నో మాటలు అంటున్నా, కొత్తకొత్త వాదనలు వినిపిస్తు,న్నా ఇంకా మనం వాటిని పట్టించుకోకుండా ఈ మధుర భావననే నమ్ముకుంటూ సాగిపోతున్నాము. కానీ మన ఆనందం కోసం, లేక నిజంగానే మనం సెక్యులర్ అని నిరూపించుకోవడాని కోసం, చరిత్రను మార్చుకుంటే .... అది మాత్రం నిశ్శంశయంగా తప్పే అవుతుంది. మనకు నచ్చినా నచ్చకున్నా సరే, "చరిత్ర" అన్నది నిక్కచ్చగా జరిగింది చెప్పాలి గానీ, మనకు నచ్చేది మాత్రం చెబితే అది చరిత్ర కాదు. అలనాటి మహారాజులు, షెహన్‌షాలు, అలాగే నేటి పశ్చిమ దేశాలు ... ఎవరికి బలముంటే వారుగా ... వారివారి కాలాలలో ... అందరూ చరిత్రలను వారికి నచ్చేటట్లు వ్రాయించుకున్నారన్నది (అది మనకు నచ్చినా నచ్చకున్నా) ముమ్మాటికీ నిజమేనని, అందరూ ఏకీభవిస్తారు. కాని అంత మాత్రం చేత, పరిశోధకులు ఏ చరిత్రనీ వదలరు. అసలు విషయం ఎప్పటికైనా బయటికి రాకా మానదు! తాజమహల్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఆసక్తి వున్నవారికి, ఆ శక్తి వున్నవారికి, వెతుక్కుంటే వెతుక్కున్నంతగా కావలసినన్ని ఋజువులు దొరుకుతున్నాయి. "ఈ పరిశోధన అవసరమా?" అన్న వారికి అసలు బాధే లేదు. వారు నిశ్చింతగా వారి స్వప్న ప్రపంచంలో విహరించ వచ్చు. ఒకరికి జ్ఞాన తృష్ణే లేనప్పుడు మనం ఏమి చెయ్యగలము. అలాగే మొండివాడు మహాబలుడు. వాడినీ ఒప్పించలేము. కానీ తెలుసుకుందామన్న జిజ్ఞాస వున్న వారిని మాత్రం ముందుకు తీసుకెళ్ళగలము.

మొదట్లో తాజమహల్ లో ఒక శివాలయము వుండేదనీ, దానిపేరు తేజోమహాలయమనీ, అందులో అగ్రేశ్వరుడనబడే శివలింగముండేదని, మొగల్ చక్రవర్తులే దాన్ని అపవిత్రం చేసి, సమాధిగా మార్చేసి, అంతటితో వదలక, ఆ కట్టడాన్ని కట్టిన ఘనతను తమకు తామే ఆపాదించుకున్నారనీ .... ఇలా హిందూ సంస్థల వద్ద నుంచీ మనం వింటూనే వున్నాము. ఇందులో నిజానిజాలు ఎంత వరకున్నాయో పరిశీలిద్దాం.

"తాజమహల్ అంటే ఒక సమాధి" అన్న భావన కొన్ని వందల సంవత్సరాలగా మనలో జీర్ణించుకుపోయిన నమ్మకం. ఒక త్రిశూలమో, కలశమో చూపించేసి ఆ నమ్మకాన్ని తుడిచేయలేము. అందుకే చాలా విస్త్రుతమైన విశ్లేషణ జరపాల్సిన అవసరం వుంది. అందుకే ఈ
విశ్లేషణ మొత్తం నాలుగు భాగాలలో చేద్దాము.

1) తాజమహల్‌లో హిందూ చిహ్నాలేమైనా వున్నాయా. ఒక వేళ వున్నా, అవి అలా వుండటానికి వేరే కారణాలేమైనా వున్నాయా?

2) అది హిందూ మందిరమే అనడానికి చారిత్రాత్మక ఆధారాలేమైనా వున్నాయా?

3) వైజ్ఞానికంగా పరీక్షలేమైనా జరిపి, సైన్సుపరంగా విశ్లేషణలు జరిపి, అది హిందూ కట్టడమే అని నిర్ధారణ చేయగలమా? 

4) పైన చెప్పినవన్నీ వున్నా, ఆ గోపురము మినార్లు, ఆర్చీలు చూస్తే అవి మహమ్మదీయ కట్టడంలాగానే కనిపిస్తున్నాయి. అది హిందూ నిర్మాణమే అని ఎలా చెప్పగలరు? 

ఈ నాలుగు భాగాలనూ విడివిడిగా చర్చిద్దాం. ఈ నాల్గు రకాల విశ్లేషణలు జరిగితే కానీ ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేము. అందుకే కొన్ని ఋజువులుగా ముందుముందుగా కనిపించినా, మన తుది నిర్ణయం మాత్రం ఈ నాలుగు భాగాల విశ్లేషణ తరువాతే చేద్దాం.

తాజమహల్ -- హిందూ చిహ్నాలు :

"తాజ్ మహల్" అన్న మాటకు ఉర్దూ అరబిక్లలో అర్థం - భవనకిరీటమట. దీన్ని 1631లో షాజహాన్ చక్రవర్తి తన మూడవ భార్య ముంతాజ్ మహల్ మరణానంతరం ఆమె పైన ప్రేమతో, ఆమెకు సమాధిగా కట్టించాడని అంటారు. దీన్ని కట్టడానికి 22 సంవత్సరాలు పట్టిందట. చివరికి 1653 లో పూర్తయ్యిన ఈ కట్టడానికి రూ 40 లక్షలు ఖర్చయ్యిందట. దీన్ని కట్టడానికి 20వేల మంది కూలీలను వాడాడనీ, మళ్ళీ ఇలాంటిది మరొకటి లేకుండా చెయ్యడానికి వారందరినీ షాజహాన్ చంపించేసాడనీ ఒక కథ ప్రచారంలోనూ వుంది. 

తాజ్ మహల్ ఒక అసమాన అష్టభుజాకారం లోని (unequal octagon) అరుగుపైన నిలుచుని మనకు దర్శనమిస్తోంది. శివునికి చుట్టూ అష్టభుజి అంటే దానికొక వైదీక అర్థం వుంటుంది. అది అష్ఠదిక్కులను, అష్ఠదిక్పాలకులను సూచిస్తుంది. ఉమ కూడా అష్టభుజే! కట్టడం మొత్తం ఆష్టభుజి మండలాకారమైన అరుగు మీదనే కాదు, లోలోపలి సమాధి గదిలో కూడా అష్థభుజి అకారంలో అలంకరించిన ఒక కంచెను (railed structure) నిర్మించి అందులో శవపేటికలను అమర్చారు. అంటే ... ఆ ఆష్టభుజి మండలాకారానికీ, తాజ్‌మహల్‌కీ ఏదో ఒక సంబంధము, విశిష్ఠత వుండివుండాని అని అనుకోవడంలో పొరపాటు ఏమీ లేదు. అంటే మన అనుమానం నిజమైతే, అది ఇదివరలో ఒక శివాలయము అని అనుకుంటే... ఆ శవపేటికలున్న స్థానంలోనే ఇదివరలో శివుడిని ప్రతిష్టించి వుండి వుండాలి.

సమాధి చుట్టూ అష్టదిక్పాలకులను సూచించే అష్ఠభుజి. ఇక్కడ మొదట్లో ఉన్న శివలింగాన్ని తీసేసి సమాధి నిర్మించారని అనుమానం.

ముఖ్య గోపురంపైన త్రిశూలకలశాలు:
 
ఈ త్రిశూలకలశాలకి చెందిన చరిత్రను కొంచెం పరిశీలీలిద్దాం. నిజానికి ఇక్కడ కనపడే ఈ రాగి కలశం అసలుది (original) కాదని అనడానికి అనుమానాలు లేకపోలేదు. ముహమ్మద్ సలహ్ కుంబో వ్రాసిన షాజహన్ నామా ప్రకారం మొదట్లో అక్కడ బంగారు కలశం వుండేది. కానీ 1873-74 కాలం నుంచీ ఇది రాగిదిగా మారిపోయి కనిపించడం మొదలు పెట్టింది. "జోసెఫ్ టైలర్" అని ఒక ఇంగ్లీషు వ్యక్తి పేరు కూడా ఆ రాగికడ్డీ మీద కనిపిస్తోందిపుడు. కాప్టెన్ టైలర్ ఒక బ్రిటీషు అధికారి. ఆయన 1810లో తాజ్ మహల్ కి మరమ్మత్తులు చేయించాడట. అంటే ఆయన ఆ కాలములో ఈ కలశాన్ని ఎందుకో మార్చివేసాడన్నమాట. అలాంటప్పుడు ఈ నకిలీ (లేక మార్చబడ్డ) కలశాన్ని పట్టుకుని మన వాదనని ఎలా కొనసాగిస్తాం? అసలు ఇలా కొనసాగించడం కూడా సమంజసమేనా?

సమంజసమే అంటున్నారు వాస్తుశాస్త్రనిపుణులు. ఎందుకంటే , తాజమహల్ కట్టడసముదాయంలోనే భాగమైన "జమైత్ ఖానా" అనబడే చోట, ఇదే త్రిశూలకలశ చిహ్నం నేల పైన కూడా తాపడం చెయ్యబడి కనిపిస్తోంది. పక్కనున్న రాళ్లతో కలిసిపోయిన ఈ నేల పైన వేయబడిన చిహ్నం, అదే రాళ్లకు, ఒకే కాలానికి చెందినదని తెలుపుతోంది. ఈ నేల పైన చిహ్నమూ, గోపురం పైన ఉన్న త్రిశూలకలశాలూ దాదాపు ఒకే పరిమాణంలో కూడా వున్నాయి. అంటే గోపురం పైన ఉన్నదానికి ఇది ఒక నకలు డిజైనని తెలుపుతోంది; అంతేకాదు, ఆ త్రిశూలకలశ చిహ్నం కూడా కేవలం అలంకారప్రాయం మాత్రమే కాదు అని గుర్తు చేస్తూ, దానికున్న మతపరమైన విలువను, ప్రాముఖ్యతనూ చాటి చెబుతూ; ఒక సాక్షంగా మనకు దర్శనమిస్తోంది. గోపురం పైన ఉన్న త్రిశూలకలశాలు సామాన్య కాకతాళీయ రూపకల్పనలు కావు అనే వాదనను బలపరుస్తోంది. ఇలా ఈ నేల పైన వున్న ఈ బొమ్మ, నల్లపాలరాతి పైన కూర్చబడి 30' 6" పొడవున కనిపిస్తుంది. కాకపోతే ముఖ్యగోపురం పైన ఉన్న త్రిశూలకలశ చిహ్నం 32' 5 ½" ఎత్తుగా వుంటుంది. మరి ఈ రెండు అడుగుల ఎత్తు తేడా ఎందుకు వచ్చింది? కాప్టెన్ టైలర్ చేయించిన మరమ్మతులలో, బంగారు త్రిశూలకలశాలని తీసి రాగిదానితో మార్చినప్పుడు ఈ ఎత్తులో పొరపాటు జరిగి వుండవచ్చు. కానీ నేలపైన కనిపించే చిహ్నంతో పోల్చి చూస్తే, సరిగ్గా అదే ఆకృతి, ఆకారంతో వుంది కనుక, బ్రిటీషువారు (బంగారాన్ని సేకరించినా, తస్కరించినా) కనీసం ఆకారం మార్చకుండా రాగిదానితో, తగిన జాగ్రత్తతో అదే ఆకృతిలో వున్న దానితోనే, మార్పిడి చేసారని, మనం నిర్ధారించవచ్చు. అది చాలు ఇది హైందవుల చిహ్నమే అని చెప్పడానికి! 

ఇక ఈ కలశాన్ని పరిశిలిస్తే, దాన్ని కలుపుకుంటూ ఒక త్రిశూలము, అర్థచంద్రుడు కనిపిస్తారు. ఈ కలశం హిందూసాంప్రదాయ కలశాన్ని(కొబ్బరికాయ, మామిడాకులతో కూడిన కలశం) పోలి వుంటుంది. అన్నీ, శివాలయ సంకేతాలే. ఇందులోని చంద్రుడిని ఇస్లాం చిహ్నమైన చంద్రుడుగా కొందరు భావిస్తారు. కానీ ఇస్లాం చంద్రుడిని సామన్యంగా నిలువుగా చూపెడతారు. ఉదాహరణకి క్రింద చూపిన మసీదుల పైనున్న చంద్రుని చిహ్నాలను చూస్తే. అవి ఏ రకంగానూ త్రిశూలాకారం లో కనిపించవు. అవి ఇస్లాం చంద్రుడిని చూపేవిధానాలు. అందుచేత తాజమహల్ పైనున్న చంద్రుడు హిందూచిహ్నంగానే మనం అనుకోవచ్చు.

                    
Crescent designs on Mosques
 
అంతే కాదు మహమ్మదీయులకి చంద్రుడిని త్రిశూలాకారంలో చూపే పద్దతిగానీ, అవసరం కానీ కూడా లేవని మనకు తెలుసు. అందుచేత ఈ త్రిశూలము, చంద్రుడు, కలశము, పద్మము .. ... ఒక శివాలయన్నీ సూచిస్తున్నాయేమో అని మనం పడే అనుమానంలో కొంత బలం కనపడుతోంది. ఇక మిగితా సంకేతాలను గమనిద్దాము.

హైందవ చిహ్నాలు అనేకం:
 
ద్వారం పైన గూడు: దక్షిణద్వారం పైన (తాజ్ గంజ్ లో) ఒక గూడు కనిపిస్తుంది. హిందూ మందిరాలలో, కోటలలో ఒక వినాయకుడి విగ్రహం అక్కడ వుంచడం పరిపాటి. ఆ విగ్రహాన్ని మొగలాయులు తీసేసి వుండవచ్చు.

రాజపుత్రుల ఆహ్వాన చిహ్నం: ముఖ్యద్వారపు గోడల పైన, వంటశాలపైన "గులాబ్-దాని" (rose-water cans) , "ఇలైచి-దాని" (cardamon pots) వంటి సంప్రదాయ రాజపుత్రుల ఆహ్వాన చిహ్నాలు కనిపిస్తాయి. దీగ్ (భారత్‌ పూర్), జైపూర్ల లోని రాజపుత్రుల భవనాలలో ఇటువంటి చిహ్నాలే కనిపిస్తాయి.

గణేష తోరణాలు: ముఖద్వారపు అంచు మొత్తం నడుము ఎత్తులో "గణేషతోరణలు" కనపడతాయి. అది హిందూదేవుడు అనుకోకపోయినా, జంతు చిహ్నాల అలంకారాలు కూడా ఇస్లాం లో ఏలాగూ నిషిద్ధమే.

మరికొన్ని వివరాలు:.
పుష్పశిల్పంలో జాగ్రత్తగా "ఓం" అన్న గుర్తును ఇమడ్చడం 
పద్మాకారంలోని త్రిశూలం
దక్షిణద్వారం పైన హైందవ కలశాలు. శివుడికి ఏకాదశ కుంభాలు (పదకొండు) సాంప్రదాయసిద్ధమే. అంతే కాక క్రిందనున్న నాగులతలలు కూడా శైవ సాంప్రదాయమే. ఇక వాటి క్రింద కనిపించే ఖురాన్ వ్రాతలు తరువాత చేర్చబడ్డవిగా తెలుస్తున్నాయి.

గోడలపై రాజపుత్రుల సాంప్రదాయిక డిజైన్లు
                    
అనేకచోట్ల ఇలా ధోత్ర పుష్ప చిత్రాలు 
ఆనేకచోట్ల ఆకులను శంఖువులుగా చిత్రీకరించడం
నాగబంధాలు
ముఖద్వారంపైన ఉన్న వినాయకుడిని తలపించే ఏనుగుతలలు
    
                         
లోపలి అష్ఠభుజి పైన చిత్రించిన కుంభాలు, పుష్పాలు అల్లికలు. శివాభిషేకానికి కావలసినవి.
హిందూ రాజపుత్ర శైలిలోని వరండాలు
లోపల 1000 అడుగుల మార్గం. మార్గానికి ఇరుప్రక్కలా అనేక నివాసయోగ్యమైన గదులు. ఇది సమాధి కాదని ఇక్కడ ఎందరో ప్రజలు నివసించేవారని తెలుపుతున్నాయి.
మూసివేయబడ్డ గదుల కప్పులపై వైదీక యంత్రాలు
గోపురం లోపల చెక్కిన బొమ్మలు. సూర్యుడు చుట్టూ ఆవరించిన త్రిశూలాలు. ఖచ్చితంగా వైదీక చిహ్నాలే మరి

ఇలా అనేక రకాల హైందవ చిహ్నాలు, జ్ఞాపకాలు తాజమహల్ లో మిగిలి కనిపిస్తాయి. హిందూ చిహ్నాలన్నీ అన్నీ తీసివేసిన షాజహాన్ ఈ చిహ్నాలను ఎందుకు వదిలేసాడు? అంటే అవి అతడికి స్పష్టముగా కనిపించకపోవడమే కారణం! అవి వేరే సాధారణ డిజైన్లని భ్రమపడే అవకాశం వుండటమే! అందువల్ల ఇవి పొరపాటున మిగిలిపోయి, మిగితా ఖురాను వ్రాతల చుట్టూ అలంకారాలుగా మిగిలిపోయివుండి వుండవచ్చు. కానీ ఇవి హైందవ చిహ్నాలని, ఏ హిందువుకైనా సరే, చూడగానే తెలిసిపోతాయి. 

" ఇదేదీ కాదు! షాజహానుకి పరమత సహనం ఎక్కువ! అందుకే హిందూ శిల్పులని తమకిష్టమొచ్చిన చిహ్నాలను చెక్కుకోమని వదిలేసా డు" అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. కానీ అతడి బాదుషానామాలోనే ఇలా వ్రాసివుందిట ...
" ఇస్లాం మతం పై నమ్మిక లేనివారికి నిలయమైన బెనారస్ లో అనేక విగ్రహారాధకులు మందిరాలను నిర్మిస్తున్నారు, అని షెహన్షావారికి తెలపడమైనది. ఆ నిర్మాణ కార్యక్రమాన్ని వారు నిలిపివేయించడం మూలంగా, ఈ విగ్రహారాధకులు తమ మందిర నిర్మాణాలకు అనుమతి ఇమ్మని కోరుతున్నారు. ఐనా చక్రవర్తులు, ఇస్లాం మతపరిరక్షకులు! వెంటనే అన్ని ప్రాంతాలలోనూ, అన్ని మందిరాలను తొలగించాలని ఆదేశాలని జారీ చేసారు. అలహాబాద్ రాష్రం నుంచీ ఇప్పుడే అందిన వార్త - - బెనారస్ లో 76 మందిరాలను నాశనం చేయించాము." ...
ఇది పరమత సహనం ఎలా అవుతుంది? షాజహానుని ఒక విశాలహృదయుడు అని ఎలా మెచ్చుకోవడం? అంతే కాదు తాజమహల్ నిర్మాణంలో హిందూ శిల్పులని వాడలేదన్న విషయానికి కూడా ఋజువులు వున్నాయి. అవి కూడా తరువాత అధ్యాయాల్లో పరిశీలిద్దాం.

ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఒక యాత్రికుడికి కనిపించేవి మాత్రమే. తాజమహల్ ముఖ్యభవనంలో యాత్రికులకు చూపించనివి ఇంకా ఐదు అంతుస్తులున్నాయి. అసలు అన్ని అంతస్తులున్నట్టే మనకు తెలియదు. ఎందుకంటే అన్నిటినీ రహస్యంగా గుప్తపరిచారన్నమాట. అందులోకి వెళ్ళి చూస్తే ఇంకా ఏమేమి కనిపిస్తాయో కూడా తరువాతి భాగాలలో చూద్దాము. 

అంటే ఇప్పటి దాకా మనం చూసింది, కొన్ని పై పై చిహ్నాలే. నిజానికి ఎవరైనా వింటే, వీటన్నిటినీ కాకతాళీయాలనీ, చెప్పి పూర్తిగా కొట్టేయచ్చు. అందులో తప్పులేదు! నిజానికి ఇది హిందువుల మందిరము అనే వాదనకి కూడా పైన చెప్పిన ఆధారాలేవీ చాలవు.

అందుకే ఇంకా లోపలికి వెళ్ళి తాజమహల్ చరిత్రను తొవ్వి చూద్దాం. ఆ చరిత్రలో బయటపడ్డ నిజాలను, ఎలా, కొట్టేస్తారో కూడా చూద్దాం! ఎన్ని భయంకర సత్యాలు బయటకి వస్తాయో చూద్దాం! (సశేషం).

 http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec11/sujananeeyam.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి